LBF News

/ Sep 24, 2025

నాలుగు లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలి

బేతంచర్ల : జూలై 9 న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ  సిఐటియు ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌ నుండి కొత్త బస్టాండ్‌ వరకు సిఐటియు పట్టణ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, సిఐటియు పట్టణ నాయకులు వైబి వెంకటేశ్వర్లు, ఖాజా లు మాట్లాడుతూ కనీసం కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా  చట్టాలకు సవరణలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం దుర్మార్గమని వీటిని  సిఐటియు వ్యతిరేకిస్తుందని వారన్నారు. బ్రిటిష్‌ కాలంలోలా మరల కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ దిగజారిందని, ఎనిమిది గంటల పని విధానాన్ని దుర్వినియోగం చేయడానికి ఈ మార్పులు చేపడ్డాయని వారు విమర్శించారు. నిరుద్యోగంతో ఒకవైపు యువత అట్టడుగుతుంటే కొత్తవారికి పని కల్పించడం మాని కార్మికులతో ఓటి చేయించాలనుకోవడం కార్మికులను మరింత పిప్పి చేయడానికే ఈ ప్రభుత్వాలు పూనుకున్నాయని వారన్నారు. యాజమానులు తమ వ్యాపారాలను తేలిగ్గా చేసుకునేందుకే ఈ మార్పులు తెస్తున్నామని కేంద్రం రాష్ట్ర పాలకులు చెబుతున్నారు తప్ప, ఈ సవరణల వలన రాష్ట్రంలోని ఫ్యాక్టరీలు, షాపులు మరియు సంస్థలలో పనిచేసే 50 లక్షల మంది కార్మికుల పెద్ద ఎత్తున నష్టపోతారని వారు అన్నారు. వారానికి 48 గంటలకు మించి పనిచేయాల్సిన అవసరం లేదని, అవసరాన్ని బట్టి రోజువారి పనిగంటలో వెసులుబాటు కోసం ఈ మార్పులు చేశామని లేబర్‌ కమిషనర్‌ పత్రికల ద్వారా లేఖలు రాశారని కార్మికుల రోజువారి లేదా వారపు పని భారాన్ని పరివేక్షించే పని లేబర్‌ డిపార్ట్మెంట్‌ చేస్తుందా! అని కార్మిక సంఘ నాయకులు ప్రశ్నిస్తే వారి దగ్గర జవాబు లేదని వారు అన్నారు. కర్ణాటకలో అంతకుముందు ఉన్న బిజెపి ప్రభుత్వం వారపు పనిగంటలు 48 ఉంచి, రోజు పనిగంటలను అవసరాన్ని బట్టి పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేయవచ్చని చట్టాన్ని మార్చిందన్నారు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేయకుండా అలాగే ఉంచిందని ఈ రాష్ట్రంలో కూడా వైసిపి, టిడిపి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక సవరణలను చేయడమో లేక వాటికి మద్దతు ఇవ్వడం చేస్తున్నాయని వారు విమర్శించారు. పార్టీలు వేరైనా వీరి విధానాలు ఒకటే అని అది బిజెపికి అనుకూలంగా పనిచేసే పార్టీలు తప్ప కార్మికుల పక్షాన నిలబడే పార్టీలు కాదని వారన్నారు. కార్మిక హక్కులపై దాడి జరుగుతున్న ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాటానికి కార్మిక వర్గం సిద్ధం కావాలని జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్కే భాష, టింగు, నాగరాజు, హమాలి వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.