LBF News

/ Sep 26, 2025

నగరంలో పర్యటించిన చెప్కో అడ్వైజరీ కమిటీ బృందం

. మురుగునీటి శుద్ది విధానాన్ని ప్రశంసించిన బృంద సభ్యులు

తిరుపతి : తిరుపతి నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారం  కొరకు డిల్లీ నుండి తిరుపతికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ ప్రజారోగ్య , పర్యావరణ ఇంజనీరింగ్‌ సంస్థ (చెప్కో) అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌.మౌర్యతో కలసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. అమృత్‌ లో భాగంగా యుజిడి నెట్వర్క్‌ ప్రధాన  పైప్‌ లైన్‌ మెయిన్‌ లైన్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఢల్లీి నుంచి మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌ అర్బన్‌ అఫైర్స్‌ అండ్‌ అమృత్‌ లోని చెప్కో విభాగం అడ్వైజరీ కమిటీ సభ్యులైన చౌరాసియా, అమిత్‌ లు తిరుపతికి చేరుకున్నారు. బుధవారం ఉదయం  భూగర్భ డ్రైనేజి యుజిడి నెట్వర్క్‌ ప్రదాన సమస్యగా ఉన్న రేణిగుంట రోడ్డులో భూమిలోకి కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రధాన పైప్‌ లైన్‌ చాలా కాలం క్రితం ఏర్పాటు చేశారని,  ప్రధానంగా ఉన్న  సమస్యలను, తదితర విషయాలను కమిషనర్‌ అడ్వైజరీ కమిటీ బృందానికి వివరించారు. అనంతరం సభ్యులు నెట్వర్క్‌ ప్రాబ్లం ఉన్న అన్ని ప్రాంతాల్లో పరిశీలించి సమస్య పరిష్కారం కొరకు చేయాల్సిన ఏర్పాట్లపై నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించారు. అలాగే తూకివాకం వద్ద నున్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. నగరం నుండి మురుగునీరు వస్తున్న విధానం, శుద్ది చేయడం, పరీక్షలు చేసిన అనంతరం నీటిని తిరిగి వినియోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ మురుగునీటి శుద్ధి విధానాన్నిఇంజినీరింగ్‌ అధికారులు వివరించారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని రెండు విధాలుగా వినియోగిస్తామని తెలిపారు. శుద్ది చేసిన నీటిని కొంత భాగం ల్యాంకో ఫాక్టరీ కి, కొంత నీటిని చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రైతులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. మురుగునీటి శుద్ధి విధానం బాగుందని ఈ మొత్తం విధానాన్ని డాక్యుమెంట్‌ రూపంలో రూపొందించాలని అధికారులకు సూచించారు. అడ్వైజరీ కమిటీ వెంట సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్యాంసుందర్‌, మునిసిపల్‌ ఇంజినీర్‌ గోమతి, డి.ఈ. రమణ, ఏ.ఈ. శిల్ప, మస్తాన్‌, తదితరులు ఉన్నారు.