LBF News

/ Sep 26, 2025

ఉపాధి భృతిగా ప్రతికూలికి ఏడాదికి రూ 12 వేలు అందించాలి

ఈనెల 21న కష్ట జీవుల పాదయాత్ర ను జయప్రదం చేయండి…

ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి కేశవరెడ్డి పిలుపు

విశాలాంధ్ర- అనంతపురం :ఉపాధి భృతిగా ప్రతికూలికి ఏడాదికి రూ 12 వేలు అందించాలని వివిధ డిమాండ్ల సాధన కోసం ఈనెల 21న కష్ట జీవుల పాదయాత్ర ను జయప్రదం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి కేశవరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనవరి 20 తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ. 37 కోట్లు ఉన్న బకాయిలను చెల్లించాలన్నారు. ఉపాధి హామీ చట్టంలో ఉన్న సమ్మర్ అలవెన్స్ 2021 నవంబర్ నుంచి ఇవ్వడం లేదన్నారు. ఉపాధి హామీ సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరణ చేయాలన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న ప్రతి కూలీకి పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తదితర డిమాండ్ల సాధన కోసం ఈనెల 21న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కష్టజీవుల పాదయాత్రను స్థానిక నార్పల మండలం బండ్లపల్లి గ్రామం నుంచి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఈనెల 22న సాయంత్రం 4.30 గంటలకు కృష్ణ కళామందిర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహిస్తున్న కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. రాంభూపాల్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, వ్యవసాయ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్, పుట్టపర్తి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య పాల్గొంటారన్నారు. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. నాగరాజు, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి డి పెద్దయ్య, గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు వైవి రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.