` పట్టించుకోని అధికారులు
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో విచ్చలవిడిగా ప్రధాన రహదారుల్లో మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి పెద్దుళ్ళపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ…… మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రం చుట్టుపక్కల, పోలేరమ్మ గుడి, స్వామి నివాస గృహ పరిధిలో మరియు అమ్మవారి శాల బాలికల వసతిగృహం పక్కన, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతున్నారని, కూల్ డ్రిరక్ షాప్ లలో కూల్ డ్రిరక్స్ అయినా దొరుకుతాయో లేదో తెలియదు కానీ మద్యం మాత్రం కచ్చితంగా దొరుకుతుందని కొందరు వ్యక్తులు కేవలం మద్యం కోసమే బంకులు ఏర్పాటు చేసుకున్నారని, కొంతమంది నాయకుల అండదండలతో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని నిత్యం ప్రజలు, పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు, పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో ప్రజలు, విద్యార్థులు, భక్తులు తిరగాలంటే భయపడుతున్నరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దేవస్థానం చుట్టుపక్కల ఐదు కిలోవిూటర్ల వరకు మద్యం విక్రయించకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ పుణ్యక్షేత్రం చుట్టుపక్కలనే మద్యం ఏరులై పారుతోందని బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకొని మద్యం అమ్మకాలు జరుపుతున్నారని బెల్ట్ షాపులపై పోలీసులు చర్యలు తీసుకోని క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు నామమాత్రంగా జరుగుతున్నయని,విక్రయదారులు మరలా యధావిధిగా మద్యం విక్రయాలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. మండల కేంద్రంతోపాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు దొరకవేమో గాని మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరుకుతుందని వెంటనే బెల్టు షాపులు మూసివేసి విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. పోలీస్ అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా బెల్టు షాపులు రద్దు చేయాలని ఆయన కోరారు.