LBF News

/ Sep 27, 2025

ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉంది

. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం

. ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృష్టిపెడతాం

. ఉండవల్లి నివాసంలో ‘షైనింగ్‌ టీచర్‌’ ను ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్‌

. విద్యార్థిగా మారి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సలహాలు, సూచనలు స్వీకరణ

ఉండవల్లి : ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉంది, విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం, ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృషిసారిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తిపట్ల అంకింతభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎం.కల్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి నారా లోకేష్‌ ‘షైనింగ్‌ టీచర్‌’ పేరుతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలిచారు2017లో జేఎం తండా మండల పరిషత్‌ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయురాలు కల్యాణి తన అంకితభావంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయులందరికీ ఆమె ఆదర్శంగా నిలిచారు. తాను బాధ్యతలు చేపట్టేనాటికి పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా అందులో ఇద్దరు మాత్రమే క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేవారు. ఒకానొక దశలో పాఠశాలను మూసివేయాలని భావించారు. ఉపాధ్యాయురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత నిధులతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందించడంతో పాటు పాఠశాలలో మౌలికసదుపాయాల కల్పనకు కృషిచేశారు. తన పనితీరుతో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించారు. దీంతో 2020`21 విద్యాసంవత్సరానికి విద్యార్థుల సంఖ్య 53 కి పెరిగింది. పొరుగు గ్రామాల నుంచి కూడా విద్యార్థులు చేరడం ప్రారంభించారు. ఇక్కడ విద్యనభ్యసించిన వారిలో 23 మంది విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశం పొందగా, ఒకరికి ప్రతిష్టాత్మక నవోదయ పాఠశాలలో ప్రవేశం లభించింది. ప్రస్తుతం పాఠశాలలో 43 మంది విద్యార్థులు ఉన్నారు.విద్యార్థిగా మారిన విద్యాశాఖ మంత్రిషైనింగ్‌ టీచర్‌ తో సమావేశం సందర్భంగా విద్యార్థిగా మారిన విద్యశాఖ మంత్రి నారా లోకేష్‌.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉపాధ్యాయురాలి నుంచి ఎంతో హుందాగా సలహాలు సూచనలు స్వీకరించారు. వాటిని ఆచరణలో పెడతామని హావిూ ఇచ్చారు. పట్టుదలతో స్కూల్‌ ను అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. సింగిల్‌ టీచర్‌ గా ఉండి పెద్దసంఖ్యలో అడ్మిషన్లు తీసుకురావడం చరిత్ర అని ప్రశంసించారు. విూ నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు కల్యాణి మాట్లాడుతూ.. నా వద్ద చదువుకునే విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఆశయంతో పనిచేశాను. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్య లభిస్తుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో కల్పించాలి. స్టార్‌ ఆప్‌ ది వీక్‌ పేరుతో ప్రతి సోమవారం హోం వర్క్‌, హాజరు, క్రమశిక్షణ, ప్రేయర్‌, హ్యాండ్‌ రైటింగ్‌, వ్యక్తిగత పరిశుభ్రత యూనిఫాంలో అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థికి బహుమతి అందజేస్తాను. వారి ప్రోగ్రెస్‌ ను నిరంతరం పర్యవేక్షిస్తాను. ‘దీర్ఘాయుష్మాన్‌ భవ’ పేరుతో విద్యార్థుల పుట్టినరోజు నాడు వ్యక్తిగత పరిశుభ్రత తెలియజేసేలా టీచర్‌ కు సబ్బు ప్రదానం చేసే సంస్కృతి తీసుకువచ్చాం. పేద విద్యార్థులు  చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ‘మా తొలి అడుగు’ పేరుతో వారికి అవసరమైన పలక, బలపం, పెన్నులు, నోట్‌ పుస్తకాలు అందజేస్తాం. ఎవరైనా స్కూల్‌ కు సెలవు పెట్టాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. నేను సెలవు పెట్టాలన్నా అనుమతి తీసుకుంటాను. పిల్లలు బాగా చదవకపోతే తల్లిదండ్రులతో ఫోన్‌ లో మాట్లాడతాను. ప్రతి రోజూ హోంవర్క్‌ ఇస్తాను. చిన్న పిల్లలకు ఫ్రూట్స్‌, వెజిటబుల్స్‌ ఫోటోల ప్రదర్శన ద్వారా వారిలో చదువు పట్ల ఆసక్తి కలిగిస్తానని వివరించారు. మెగా పేరెంట్స్‌ టీచర్‌ విూటింగ్‌ వల్ల ఎంతో ప్రయోజనం ఉందని, ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనంగా మరో టీచర్‌ ను కేటాయించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.