. ఈసారి డేట్ మారదు.. ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ
. ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదలైంది.
పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా కనువిందు చేయనున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
జూలై 3(గురువారం) హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అలాగే అభిమానుల కోసం దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో థియేటర్లన్నీ కళకళలాడాయి.
’హరి హర వీరమల్లు’ ట్రైలర్ ను మూడు నిమిషాల నిడివితో రూపొందించారు. ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపిస్తున్నారు. ఢల్లీి సుల్తానులు నుండి సనాతన ధర్మాన్ని రక్షించడానికి నడుం బిగించిన యోధుడు, మొఘల్ శక్తిని ధిక్కరించిన వీరుడు ‘వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు కట్టిపడేసింది. మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత అపఖ్యాతి పాలైన పాలకులలో ఒకరైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ భయంకరంగా కనిపిస్తున్నారు. ‘కోహినూర్ వజ్రం’ కోసం పోరాటం, మొఘలులతో వీరమల్లు తలపడటం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
గంభీరమైన రూపాన్ని కనబరుస్తూ, సనాతన ధర్మం పట్ల మక్కువను వ్యక్తపరుస్తూ.. భయమనేది ఎరుగని వీరుడు ‘వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు నభూతో నభవిష్యత్. వీరమల్లు పాత్ర కోసం తనని తాను మలచుకున్న తీరు అమోఘం. యాక్షన్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ మరింతగా ఆకట్టుకున్నారు. తన అద్భుతమైన అభినయం, ఆహార్యంతో వీరమల్లు పాత్రకు ప్రాణం పోశారు.
ట్రైలర్‌లోని ‘‘ఆంధి వచ్చేసింది’’ అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయక రాజకీయ ప్రయాణాన్నిఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటను గుర్తు చేసేలా ఉన్న ఈ డైలాగ్.. అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా చేస్తోంది. ‘‘అందరూ నేను రావాలని దేవుడిని ప్రార్థిస్తారు… కానీ విూరు మాత్రం నేను రాకూడదని కోరుకొంటున్నారు’’ అనే మరో డైలాగ్ కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఇమేజ్ కి తగ్గట్టుగా అభిమానులు మెచ్చేలా ఉంది.
ట్రైలర్ లో అణువణువునా దర్శకత్వ ప్రతిభ కనిపించింది. దర్శకుడు జ్యోతి కృష్ణ చారిత్రక కథకు తగ్గట్టుగా చిత్రానికి భారీతనాన్ని తీసుకొచ్చారు. ట్రైలర్‌లో యుద్ధ సన్నివేశాలు, ముఖ్యంగా వీరమల్లు`మొఘలుల మధ్య యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. బలం మరియు శక్తికి చిహ్నంగా చిత్రాన్ని మలిచిన తీరు మెప్పించింది. అలాగే, వీరమల్లు పాత్రకు కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా, అందరూ ఆకర్షితులయ్యేలా తీర్చిదిద్దారు.
పంచమి పాత్రలో నిధి అగర్వాల్ చక్కగా ఒదిగిపోయారు. ఛాయాగ్రాహకులు జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస సన్నివేశాలను అందంగా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉండి, ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తోంది. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి తన అద్భుతమైన సెట్ లతో ప్రేక్షకులను మొఘల్ యుగంలోకి తీసుకువెళ్లారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి తన నేపథ్య సంగీతంతో ట్రైలర్ ను మరోస్థాయికి తీసుకెళ్ళారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ అద్భుతంగా ఉంది.
ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు, ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం మాట్లాడుతూ.. ‘‘చరిత్రను గుర్తుచేసే సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారు చేసిన పూర్తిస్థాయి పాన్ ఇండియా యాక్షన్ చిత్రమిది. విూ ఆనందం చూస్తుంటేనే.. ట్రైలర్ విూ అంచనాలకు మించి ఉందని అర్థమవుతోంది. సినిమా ఇంతకుమించి ఉంటుంది. ఈ చిత్రం ఇంత అద్భుతంగా రావడానికి నా కుమారుడు జ్యోతికృష్ణ ఎంతగానో శ్రమించాడు. ఇప్పటిదాకా విూరు పవర్ స్టార్ ను చూశారు, ఈ సినిమాలో రియల్ స్టార్ ను చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు సినీ జీవితంలోనే కాదు.. నిజజీవితంలోనూ రియల్ హీరో.’’ అన్నారు
నిర్మాత ఎ. దయాకర్ రావు మాట్లాడుతూ.. ‘‘ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా జూలై 24న వస్తుంది. ఆరోజు అసలైన పండుగ జరుపుకోబోతున్నాం. ఇది మా టీం ఆరు సంవత్సరాల కష్టం. సినిమా అద్భుతంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి హృదయంలోనుంచి వచ్చే మాటలను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుంది. మన చరిత్రను మనకు గుర్తు చేస్తుంది.’’ అన్నారు.
దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. ‘‘కొందరు సినిమా గురించి అసత్య ప్రచారాలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. మా పని మేము చేసుకుంటూనే ఉన్నాము. ఎ. ఎం. రత్నం గారు ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే అనిపిస్తుంది. ఇండియా మొత్తం తిరిగి చూసేలా ఈ సినిమా ఉండబోతుంది. అప్పట్లో ఖుషి సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో మొదటి వంద కోట్ల సినిమా గబ్బర్ సింగ్. అది పవర్ స్టార్ అంటే. ఇప్పుడు మన సినిమాతో మరో భారీ విజయం సాధించబోతున్నాం. ఈ సినిమాకి పునాది వేసిన క్రిష్ గారికి ధన్యవాదాలు. అలాగే తన విలువైన సమయాన్ని కేటాయించి, మాకు అండగా నిలిచిన త్రివిక్రమ్ గారికి కృతఙ్ఞతలు. చివరిగా ఒక్క మాట. ఈసారి డేట్ మారదు.. ఇండస్ట్రీ రికార్డులు మారతాయి.’’ అన్నారు.
కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘విూ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం.’’ అన్నారు.
మొత్తం విూద, ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ ద్వయం తమ అసాధారణ ప్రతిభతో ఓ గొప్ప దృశ్యకావ్యానికి జీవం పోశారు. ట్రైలర్ లో చూసింది తక్కువేనని, ఇంతకు మించి ఎన్నో రెట్ల అద్భుతాన్ని సినిమాలో చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది.
‘హరి హర వీరమల్లు’ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.