LBF News

/ Sep 26, 2025

సీఎం రేవంత్‌ రెడ్డి పై.. సుబేదారి పోలీస్‌ స్టేషన్లో.. దళిత నేతల ఫిర్యాదు

. దళిత ఎమ్మెల్యే పై.. సీఎం వ్యాఖ్యలు గర్హనీయం

. సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్న వీడియో

హనుమకొండ : సోషల్‌ విూడియాలో సర్కులేట్‌ అవుతున్న ఒక వీడియోలో ఎమ్మెల్యే వేముల వీరేశం ను ఉద్దేశించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ  దీనిపై ముఖ్యమంత్రి పై కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఆర్‌ఎస్‌ నాయకులు హనుమకొండ సిటీలోని సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ లో మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, కమలాపూర్‌ మండల మాజీ జెడ్పిటిసి మారేపల్లి నవీన్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు పోడేటి రామస్వామి, సరికొమ్ముల వెంకటేష్‌, మొలుగు దిలీప్‌, ములుగు పూర్ణచందర్‌, తొగరు బిక్షపతి, మాట్లరాజకుమార్‌ తదితరులు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశమును ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ‘‘బట్టలూడదీసి నడిబజార్లో కొడతామని, నల్లగొండ క్లాక్‌ టవర్‌ వద్ద బట్టలూడదీసి .. పగలగొడితే’’ అంటూ అభ్యంతరకరమైన అగౌరవమైన ఉపయోగించడానికి వీలులేని భాషలో వ్యాఖ్యానించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దిబ్బ తీసాయని, బెదిరించేలా ఉన్నాయని వారన్నారు. ఈ ఫిర్యాదు పరిశీలించి విచారణ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు. కాగా సీఎం రేవంత్‌ రెడ్డి పై సుబేదారి పోలీస్‌ స్టేషన్లో బి ఆర్‌ ఎస్‌ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించడంతోపాటు చర్చనీయాంశమైంది.