. జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్‌ఇ సుదర్శనం
మెట్ పల్లి : ప్రస్తుత వర్షా కాలంలో బ్రేక్ డౌన్, విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సకాలంలో స్పందించి పునరుద్ధరించక పోతే కఠినమైన చర్యలు తప్పవని జగిత్యాల జిల్లా ఎన్పీడీసీఎల్ ఎస్ ఇ సుదర్శనం అన్నారు. మెట్ పల్లి లో నిర్వహించిన డివిజన్ స్థాయి సవిూక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నిరంతరాయ విద్యుత్ సరఫరా, కొత్త కనెక్షన్లు పౌర సేవా పత్రం అనుసరించి వేగంగా విడుదల చేయడం అంశాలని, తదనుగుణంగా పురాతన విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ లలో లోపాలు సరిదిద్ది, నెట్వర్క్ ను ఆధునీకరించా లని, శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ వ్యవస్థ ను బలోపేతం చేయాలని, నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందించడానికి కృషి చేయాలని సూచించారు.కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల ను మార్చే ప్రక్రియలో సిబ్బంది విధిగా ఉండాలని, రైతులను అట్టి పనులకు పురమాయించి ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దని అన్నారు. గత నెలరోజుల్లో మెట్ పల్లి డివిజన్ లో సంభవించిన విద్యుత్ ప్రమాదాలు పునరావృతం కాకూడదని,అందుకు సిబ్బంది అన్ని ముందస్తు రక్షణ చర్యలు గైకొనాలని ఆదేశించారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల్లోగా ఏఇలు తమ కార్య క్షేత్రంలో మొత్తం సిబ్బందిని ఒకేచోట సమావేశపరిచి రక్షణ సామగ్రి వాడకంపై అవగాహన కల్పించి విలువైన తమప్రాణాలు, ప్రజలు, పశువుల ప్రాణాల రక్షణకు ప్రతిజ్ఞ చేయాలని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్‌ఇ సుదర్శనం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డీఈ మధుసూదన్, డిఈ టెక్నికల్ గంగారం, ఏడీఇలు మనోహర్, రఘుపతి, ఏఇలు రవి, ప్రదీప్, శివకుమార్, అజయ్ తదితరులు, ఏఏఓ భూమయ్య, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.