. కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి : నగరంలోని మురుగునీటి కాలువల్లో చెత్త వేయవద్దని, విూ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం నగరంలోని 2, 3 వ వార్డులో ప్రజల నుండి వచ్చిన సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి కమిషనర్ పరిశీలించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త ఉండటాన్ని చూసి కాలువల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని మురుగునీటి కాలువలో ప్రజలు చెత్త వేస్తున్నారని దీంతో దాన్ని తొలగించేందుకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు. విూ ఇంటి వద్దకు వచ్చే మునిసిపల్ సిబ్బందికి చెత్త ఇచ్చి నగర సుబ్రతాకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డ్రైనేజీ కాలువల మరమ్మతులు చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తెలుగు గంగ నీటి పైప్ మరమ్మత్తులు చేసి నీరు వృథా కాకుండా చూడాలని అన్నారు. ముఖ్యంగా ప్రతి రోజు ఇండ్ల వద్ద చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసిపి బాలాజి , డి.ఈ.లు లలిత, శిల్పా, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడీపీ నాయకులు కోడూరు బాల సుబ్రమణ్యం, సిపిఐ నాయకులు చిన్నం పెంచులయ్య, స్థానికులు కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.