LBF News

/ Sep 26, 2025

బాసర క్షేత్రంలో ఉత్తమ దాంపత్య జీవన సాఫల్య పురస్కారములు ప్రదానం

హైదరాబాద్‌ – జూన్‌ 19 :  వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ సవిూపములో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమము( కోటి పార్థివలింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము ) మాసో త్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమములు, అధ్యాత్మిక ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవం గా జరిగినవి. ముందుగా   దీపారాధన,కలశస్థాపన,  పుణ్యాహవచనము ,లక్ష్మీ గణపతి,  వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య, కోటి పార్థివ లింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగములకు మహా రుద్రాభిషేకము , కుంకుమార్చన ,గణపతి, నవగ్రహ ,రుద్ర ,సరస్వతి హోమములు,  భూదాన  సంకల్ప పూజ, మరియు అన్నదానము ఘనంగా జరిగింది..సాంస్కృతిక కార్యక్రమములో   భాగంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గణించిన   న్యూ ఇండియా అస్యూరెన్స్‌  కంపెని లిమిటెడ్‌ రిటైర్డ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌    సీతంరాజు సూర్య కుమార్‌ కరుణకు,సంస్కృతాంధ్ర భాషా కోవిదులు,  వైదిక కార్యక్రమ నిర్వాహకులు, సుబ్బారావు అనురాధ కు, నందగిరి వీరభద్ర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు, దేవాలయ అభివృధ్ధి సమితి సభ్యులు   శ్రీనివాస్‌ శర్మ  కళ్యాణికి, నిర్మల్‌  వాస్తవ్యులు శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి  ప్రియ శిష్యులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్‌ గ్రహీత, విశ్రాంత అధ్యాపకులు, గాదె ప్రమోద్‌ సరళలకు నలుగురికి ఉత్తమ దాంపత్య జీవన సాఫల్య పురస్కారములు  మరియు  వరంగల్‌ వాస్తవ్యులు శ్రీమయూరి నాట్య కళా క్షేత్రం వ్యవస్థాపక అధ్యక్షులు నాట్యాచార్యులు    కే  అరుణ  రాజ్‌ కుమార్‌ కి ఉత్తమ  సాంస్కృ తిక నాట్య సేవా  పురస్కారము శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి  వ్యవస్థాపక అధ్యక్షులు శివ శ్రీనిర్మల సంధ్య అంబికానాథ శర్మ  దంపతులు అందజేసి సత్కరించారు. నాట్య గురువుల యొక్క శిష్యులు చక్కని నృత్యాభినయంతో కళా ప్రియులను కట్టి పాడేశారు.పదాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ భావాలకు అద్దం పట్టేలా అభినయిస్తూ ప్రదర్శించిన నృత్యాంశములు అందరిని ఆకట్టుకున్నాయి.ఉత్తమ   దాంపత్య జీవన సాఫల్యపురస్కార గ్రహీతలు  సభలో  మాట్లాడుతూ  బాసర సరస్వతి క్షేత్రము లో    ఈ పురస్కారం అందుకోవడము ఆనందము గా  మరియు గర్వము గా ఉన్నదని  మరియు ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము లో   వ్యయ ప్రయాసలకు  ఓర్చి ప్రతి నెల    మాసోత్సవము సందర్భముగా ప్రత్యేక  పూజ కార్యక్రమములు, సంగీత, సాహిత్య,నృత్య, ధార్మిక , ఆధ్యా త్మిక కార్యక్రమాలు నిర్వహించడం  చాలా గొప్ప విషయమని మరియు దేవాలయ అభివృద్ధికి మేమంతా సహకరిస్తామని అన్నారు.  భైంసా వాస్తవ్యులు  గుజ్జలవార్‌ సాయినాథ్‌ సంధ్య, ముత్యం సాంబశివరాజు సవిత, కొత్త వార్‌ శ్రీనివాస్‌ రమాదేవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.