LBF News

/ Sep 26, 2025

ఫోన్లు ట్యాప్‌ చేయడం దుర్మార్గపు చర్య 

.ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎంతటివారున్నా శిక్షపడాల్సిందే

.టిపిసిసి ఛీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌ ` జూన్‌ 17 : అసెంబ్లీ ఎన్నికల వేళ టిపిసిసి ఛీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన మంగళవారం జూబ్లీహిల్స్‌ పిఎస్‌ కు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతల ఫోన్లు ట్యాప్‌ చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. తమ ఫోన్లు ట్యాప్‌ చేసి బిఆర్‌ఎస్‌ రాజకీయ లబ్ది పొందిందని, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా అధికారులు, నేతలకు శిక్ష పడాలని సూచించారు. టెలిగ్రాఫ్‌ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లను ట్యాప్‌ చేశారని మండిపడ్డారు.రాజకీయనాయకుల ఫోన్లు ట్యాప్‌   చేయడం హేయమైన చర్య అని ఫోన్ల ట్యాపింగ్‌ కు పాల్పడిన మాజీ సిఎం కెసిఆర్‌, బిఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు. సుమారు 650 మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల ట్యాప్‌ జరిగిందని, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎంతటివారున్నా శిక్షపడాల్సిందేనని డిమాండ్‌ చేశారు. రాజకీయ నేతలు, జడ్జిలు, అధికారుల ఫోన్లనూ ట్యాప్‌ చేశారని, ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లే కాంగ్రెస్‌ కొన్ని స్థానాల్లో ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. నక్సల్స్‌ తో సంబంధం ఉందనే అసత్య ఆరోపణలతో తమ ఫోన్లు ట్యాప్‌ చేశారని, బిఆర్‌ఎస్‌ ఓడిపోతుందని తెలిసే.. హార్డ్‌ డిస్కలను ధ్వంసం చేశారని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ దుయ్యబట్టారు.