LBF News

/ Sep 26, 2025

పేద గుండె కోసం కదిలిన ఆపన్న హస్తాలు

తుగ్గలి :  కూలీ పనికి వెళ్తే గాని పూటగడవని పేద గుండెకు ఆర్థిక సహాయం అందించడానికి ఆపన్న హస్తాలు ముందుకు వచ్చాయి.ఆ నిరుపేద కుటుంబానికి అక్షరాల 25 రూపాయలను స్వయం రక్షక సేన గ్రూపు తరఫున అందజేశారు.వివరాలలోకి వెళ్ళగా తుగ్గలి మండల పరిధిలోని గల చెన్నంపల్లి గ్రామం నందు శంకర్‌ అనే వ్యక్తి కూలీ పనులకు వెళ్తూ వచ్చే డబ్బుల ద్వారా తన కుటుంబాన్ని పోషించుకునేవాడు.ఇటీవల కాలంలో కుటుంబ బాధ్యతలు మోసే శంకర్‌ పక్షవాతం బారిన పడడంతో,కూలీ పనులకు వెళ్లలేక కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.చివరకు వారు నివసించే ఇంటికి అద్దె కూడా చెల్లించలేని నిస్సహాయక స్థితిలో ఆ కుటుంబం ఉంది.ఇటీవల శంకర్‌ మరియు వారి కుటుంబ సభ్యులు చెన్నంపల్లి గ్రామంలో గల జయచంద్ర, రాజేంద్ర గౌడ్‌ ల వద్దకు చేరుకొని వారి ఆర్థిక పరిస్థితిని వివరించి తమ కుటుంబ పోషణ కొరకు ఆర్థిక సహాయం కోసం వారు అభ్యర్థించారు.ఈ క్లిష్ట పరిస్థితులలో వెంటనే స్పందించిన వారు నాయకత్వం వహించి దాతల మంచి మనసుతో శంకర్‌ కుటుంబానికి స్వయం రక్షక సేన గ్రూపు ద్వారా 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆదివారం రోజున శంకర్‌ మరియు వారి కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దల సమక్షంలో అందించారు.ఈ సందర్భంగా జయచంద్ర,రాజేంద్ర లు మాట్లాడుతూ ప్రస్తుత యువత మానవతా విలువలతో కూడిన దేశాన్ని నిర్మించాలని,ఆర్థికంగా మరియు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్న పేద ప్రజలకు ముందుండి ఆదుకోవాలని వారు తెలియజేశారు.దేశం మరియు ప్రజల గురించి ఆలోచించి సామాజిక కార్యకలాపాలలో పాలుపంచుకోవాలని వారు తెలియజేసారు.నేటి యువతే దేశానికి ప్రగతి బాటలు వేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తిమ్మప్ప గౌడ్‌,ఉరుకుందు గౌడ్‌,రంజాన్‌ వలి,శవాషప్ప,సుధాకర్‌ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.