LBF News

/ Sep 26, 2025

పార్టీ శ్రేణులను పరామర్శిస్తే తప్పా?

. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి

అమరావతి – జూన్‌ 19 :  వైఎస్‌ఆర్‌ సిపి పార్టీ శ్రేణులను పరామర్శిస్తే తప్పా?, ఎందుకు ఇన్ని ఆంక్షలు? అని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. మొన్నటి పొదిలి పర్యటనలోనూ తనకు ఇబ్బందులు సృష్టించారని మండిపడ్డారు. గురువారం జగన్‌ విూడియాతో మాట్లాడారు. 40వేల మందిపై రాళ్లు వేసే ప్రయత్నం చేశారని, రైతులు సంయమనం పాటించారని, అయినా కేసులు పెట్టారని,  రైతులను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా? టాపిక్‌ డైవర్ట్‌ చేయడానికే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారని చురకలంటించారు. తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వనని అన్నందుకు చెవిరెడ్డి గన్‌మెన్‌ను హింసించారని, ఆ గన్‌మెన్‌ స్వయంగా డిజిపి, రాష్ట్రపతికి లేఖలు రాయాల్సి వచ్చిందన్నారు. చెవిరెడ్డి కుమారుడిని కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, లిక్కర్‌ కేసులో సంవత్సరం నుంచి చెవిరెడ్డి భాస్కర్‌ పేరే లేదన్నారు.చంద్రగిరిలో ఎదురు ఉండకూడదనే చెవిరెడ్డిపై కేసులు పెట్టారని జగన్‌ ఆరోపణలు చేశారు. సడెన్‌గా గిరి అనే కానిస్టేబుల్‌ను తెరపైకి తీసుకొచ్చారని, ఇరికించాలనుకుంటే ఎవరినైనా ఇరికించొచ్చన్నారు. లిక్కర్‌ కేసులో లేని ఆధారాలను తయారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిన్నెల్లిపైనా తప్పుడు కేసులు పెట్టారని, నందిగం సురేష్‌పైనా కేసుల విూద కేసులు పెడుతున్నారని, వల్లభనేని వంశీని 60రోజులుగా జైలులో పెట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని బీహార్‌ను చేయడంలో చంద్రబాబుకు మించిన గొప్ప నాయకుడు ఎవరూ లేరని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య తన పర్యటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.