రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రతిపాదన పై హర్షం
హైదరాబాద్ : నగరంలో కొత్త ఆటో రిక్షా పర్మిట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జిఓ జారీ చేసినందుకు మరియు రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వ ప్రతిపాదన ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ నేతలు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్, బషీర్ బాగ్, దేశోద్ధారక భవన్ లో సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం (ఎఐటియుసి), వి.మారయ్య, మహేష్ (బిఆర్టియు,) పి.శ్రీకాంత్, అజయ్బాబు (సిఐటియు), వి.ప్రవీణ్ (టియుసిఐ), ఎం.ఎ.సలీం, నజీర్, రఫీక్ (యుటిఎడిడబ్ల్యుఎ,) పి.రాంరెడ్డి (ఐఎఫ్టియు), పి. యాదగిరి (టీఎన్టీయూసీ) ఎస్.కె.పి. జమ (జిహెచ్‌ఎడియు) లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బి. వెంకటేష్ మాట్లాడుతూ కొత్తగా ఆటో రిక్షా పర్మిట్లు జారీకి, రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు గత రెండు దశాబ్దాలుగా అనేక రూపాల్లో పోరాటాలు నిర్వహించామని, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు, ఎమ్యెల్సీ ప్రో. ఏం. కోదండరాం లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, పలుమార్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేర్చలు జరిపి జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్ పరిధిలో కొత్తగా 60 వేల ఆటో రిక్షా పర్మిట్లు ఇవ్వడానికి ప్రభుత్వ జిఓ జారీ కృషి చేసారని అలాగే రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రతిపాదన ప్రకటింపజేశారని తెలిపారు. 2023 సంవత్సరం నుండి ఆటో విూటర్ చార్జీలు నాటి ప్రభుత్వాలు పెంచకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆటో డ్రైవర్లు అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో విూటర్ చార్జీలు మినిమం ఛార్జి రూ.50/`, కిలోవిూటర్ కు రూ. 20/` పెంచాలని, ఎన్నికల మానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు హావిూ ఇచ్చిన రూ.12.000/` ఆర్థిక సహాయం వెంటనే అందజేయాలని అలాగే ఆటో డ్రైవర్ల పొట్టకొడుతున్న ఓలా, ఊబర్, రాపిడోల బైక్ టాక్సీ లను నిషేదించాలని బి.వెంకటేశం విజ్ఞప్తి చేసారు.