LBF News

/ Sep 26, 2025

కేసీఆర్‌ పొలిటికల్‌ ప్రాజెక్టు రెడీ:

హైదరాబాద్‌ : భారత రాష్ట్ర సమితి చీఫ్‌ కేసీఆర్‌ ప్రజల్లోకి వచ్చేందుకు సరైన కారణం కోసం చూస్తున్నారు. అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందన్న కారణంతో ప్రజల్లోకి రావాలని నిర్ణయించు కున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్‌ భావిస్తున్నారు.

కాళేశ్వరం, పాలమూరు  రంగారెడ్డి ప్రాజెక్టులే ప్రధానం

కేసీఆర్‌ తన పదేళ్ల పాలనా కాలంలో కాళేశ్వరంకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపుగా పూర్తి చేశారు. కానీ అసలు ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో ప్రాజెక్టుకు అర్థం లేకుండా పోయింది. దాంతో సమస్యలు చుట్టు ముట్టాయి. అది చాలా చిన్న సమస్య అని రిపేర్‌ చేస్తే అంతా సర్దు కుంటుందని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిర్మాణాలు చేసేలా ఒత్తిడి చేయడంతో పాటు ప్రజల్లో ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందన్న భావన వచ్చేలా చేయడానికి కేసీఆర్‌ ప్లాన్‌ రెడీ చేస్తున్నారు.

కాళేశ్వరం పై ప్రజల్లో ప్రధానంగా చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగాలు. అందులో జరిగిన అవినీతి వ్యవహారాలపై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి స్పందన వస్తుందన్నది బీఆర్‌ఎస్‌ వర్గాలు అంచనా వేయలేకపోతున్నాయి. ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కేటీఆర్‌ వ్యక్తిగత దూషణల రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇప్పటి వరకూ ప్రాజెక్టులు, అభివృద్ధి వంటి అంశాలపై చర్చ ప్రారంభం కాలేదు. ఇప్పుడు కేసీఆర్‌ ఆ టాపిక్‌ ను డైవర్ట్‌ చేసి.. ప్రాజెక్టుల అంశంపైకి మార్చాలనుకుంటున్నారు.

బీఆర్‌ఎస్‌ పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యం:

రోజు రోజుకు బీఆర్‌ఎస్‌ పరిస్థితి దిగజారిపోతోందని కేసీఆర్‌ కు క్లారిటీ వచ్చిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కేటీఆర్‌ శల్య సారధ్యం.. కవిత సొంత కుంపటి తరహా రాజకీయాలతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడిరది. అన్నింటికి మించి ప్రభుత్వంపై సోషల్‌ విూడియాలో బూతులు తిట్టడం, తిట్టించడం మినహా ప్రతిపక్ష పాత్ర పోషించిన దాఖలాలు లేకపోవడంతో ప్రజల్లోనూ స్పందన కనిపించడంలేదు. ఇప్పుడు కేసీఆర్‌ ఈ పరిస్థితిని మార్చాలని అను కుంటున్నారు. అందుకే ప్రాజెక్టుల అంశంతో తెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.