` స్పందించకపోతే 9న డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా.
`యుటిఎఫ్ కడప జిల్లా శాఖ హెచ్చరిక.
బద్వేలు : ఇటీవల విద్యాశాఖ చేపట్టిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ బదిలీల మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నందు ప్రిఫరెన్షియల్ కేటగిరిలో కేటాయించవలసిన స్థానాల కంటే అధికంగా కేటాయించి, బదిలీల చట్టం`2025ను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కడప, ప్రొద్దుటూరు మండల విద్యాశాఖాధికారులు డి.గంగిరెడ్డి, సావిత్రమ్మలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్ బాబులు ప్రశ్నించారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే జులై 9వ తేదీ కడప డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. బుధవారం ఉదయం కడపలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో షేక్ శంషుద్దీన్ కు యుటిఎఫ్ కడప జిల్లా శాఖ పక్షాన ధర్నా నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీల్లో కడప, ప్రొద్దుటూరు ఎంఈఓలు వ్యవహరించిన తీరు వల్ల ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బదిలీల చట్టం`2025 ప్రకారం ప్రిఫరెన్షియల్ కేటగిరికి ఒక పాఠశాలలో 40 శాతానికి మించి పోస్టులు కేటాయించకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ కడప మరియు ప్రొద్దుటూరు మండల విద్యాశాఖాధికారులు చట్టాన్ని బేఖాతాలు చేస్తూ ప్రిఫరెన్షియల్ కేటగిరికి ఇస్టారాజ్యంగా పోస్టులు కేటాయించారన్నారు. బదిలీల కౌన్సిలింగ్ నందు కడప, ప్రొద్దుటూరు మండలాల పరిధిలో నిబంధనల కంటే ఎక్కువ పోస్టులను ప్రిఫరెన్షియల్ కేటగిరీలో చూపించి జనరల్ కేటగిరిలో ఉన్నవారికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. మండల విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు పదిమంది జనరల్ కేటగిరి ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఎంఈఓ ల నిర్లక్ష్య వైఖరి వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులతో పాటు ఒత్తిడికి గురయ్యారని వారు పేర్కొన్నారు. అధికారులు జరిగిన తప్పును గుర్తించి, కౌన్సిలింగ్ ను రద్దుచేసి తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, తప్పును సరి చేయకుండా అర్థ రాత్రి తర్వాత బదిలీల ప్రక్రియను కొనసాగించారన్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టగా ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని సవరించడంతోపాటు, నిర్లక్ష్యానికి, అక్రమాలకు బాధ్యులైన కడప, ప్రొద్దుటూరు ఎంఈఓ లపై తక్షణమే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖధికారి హావిూ ఇచ్చారన్నారు. ఎంఈఓ ల వైఖరిపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ కమిషనర్ లకు సైతం యుటిఎఫ్ పక్షాన ఫిర్యాదు చేశామన్నారు. బదిలీల కౌన్సిలింగ్ పూర్తయి 20 రోజులు దాటినా ఇంతవరకు ఎంఈఓ లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తగదన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృత్తమయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, బదిలీల చట్టాన్ని ఉల్లంఘించిన కడప, ప్రొద్దుటూరు మండల విద్యాశాఖాధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే 10వ తరగతి పరీక్షల, మూల్యాంకన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పారితోషికాన్ని చెల్లించకుండా కాలయాపన చేయడం తగదన్నారు. పరీక్షలు, మూల్యాంకనం పూర్తయి మూడు మాసాలు కావస్తున్నా చెల్లింపులు చేపట్టకపోవడం తగదన్నారు. తక్షణమే పరీక్షల, మూల్యాంకన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లింపులకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ రెండు డిమాండ్లపై జూలై 9వ తేది డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు వారు తెలిపారు.