LBF News

/ Sep 26, 2025

ఇల్లు కట్టు – మేకపోతు పట్టు

. అర్హులైన పేదలకు ఇళ్లు : మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

. రెండు నెలల్లో 3500 ఇండ్లు : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

. మొదటి లబ్దిదారునికి యాటపోతు, పట్టుబట్టలు బహుకరించిన బీర్ల

యాదగిరిగుట్ట : గ్రామంలో ఎవరైతే త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుని తొలి లబ్ధిదారునిగా నిలుస్తారో వారికి గృహప్రవేశం రోజున మేకపోతు, పట్టు వస్త్రాలు బహుకరిస్తానన్న మాటను ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బుధవారం నిలబెట్టుకున్నారు. తన స్వగ్రామమైన సైదాపురం లో తొలిగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసిన ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్‌ దంపతులకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ చేతుల విూదుగా పట్టువస్త్రాలు, మేక పోతును బహూకరించారు. రిబ్బన్‌ కట్‌ చేసి మంత్రి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. పాలు పొంగించి, పూజలు చేసి ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హావిూ ఇచ్చిన బీ ఆర్‌ ఎస్‌ ప్రభుత్వం పదేండ్ల పాలనలో విఫలమై ప్రజలను మోసగించిందని అన్నారు. తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదోడి సొంతింటి కలను నిజం చేస్తోందన్నారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ వచ్చే రెండు నెలల్లోనే ఆలేరు నియోజక వర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి తీరుతామన్నారు. త్వరలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల  ఎంపిక పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హావిూ ఇచ్చారని చెప్పారు.