తెహ్రాన్ : ఇజ్రాయిల్`ఇరాన్ మధ్య రోజురోజుకూ యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఇరుదేశాలు మిస్సైళ్లతో ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడానికి అమెరికా అత్యంత శక్తిమంతమైన జీబీయూ-57 ‘బంకర్ బస్టర్’ బాంబులను ప్రయోగించవచ్చనే వార్తలు పెద్ద కలకలం రేపుతున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని గమనిస్తున్నాయి. ఇజ్రాయిల్`ఇరాన్ పోటాపోటీగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి.
దాడులు తీవ్రం
మరోపక్క ఇరాన్`ఇజ్రాయిల్ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ గగనతల దాడులు చేస్తుండగా.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఐదో రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడిరది. అత్యంత కచ్చితత్వంతో మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడిరచింది. అంతేకాకుండా గ్లిలాట్లోని ఇజ్రాయిల్ మిలటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్‌పైనా క్షిపణి ప్రయోగించినట్లు తెలిపింది. ఇజ్రాయిల్ పక్కా ప్రణాళికలతో దాడులు చేస్తోందంటే… దానికి కారణం కచ్చితంగా మొస్సాద్ సంస్థే. ఇరాన్లో అణుస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి నుంచి.. కీలక అధికారులు, శాస్త్రవేత్తల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇజ్రాయిల్‌కు చేరవేసింది. అంతేకాకుండా ముందుగానే ఇరాన్‌కు భారీ మొత్తంలో డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడం వెనుకా ఈ సంస్థ హస్తముంది. ఈ నేపథ్యంలోనే మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ క్షిపణి ప్రయోగించినట్లు తెలుస్తోంది. మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికాలకు సమాచారం ఇచ్చిన ఇరాన్.. దాడులు మాత్రం ఆపడం లేదు. ఇరుదేశాల మధ్య మొదలైన ఈ సంఘర్షణపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియని పరిస్థితులు కన్పిస్తున్నాయి. కాగా తెహ్రాన్‌లోని ఒక విమానాశ్రయంలో నిలిపి ఉంచిన రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలను ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. ఈ దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) విడుదల చేసింది. ఇజ్రాయిల్ విమానాలను అడ్డగించేందుకే ఈ ఎఫ్-14 జెట్లను అక్కడ ఉంచారని ఐడీఎఫ్ ఆరోపించింది. యుద్ధ విమానాలపై దాడులతో పాటు, ఇజ్రాయిల్‌పైకి డ్రోన్లను ప్రయోగించేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా విఫలం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. నిఘా వర్గాల సమాచారంతో, డ్రోన్ లాంచర్లు, ఆయుధాలను అమరుస్తున్న ఒక బృందాన్ని గుర్తించి, ప్రయోగానికి కొద్ది నిమిషాల ముందే వారిని మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడిరచింది. ఇరాన్‌లోని బ్యాంకింగ్ వ్యవస్థను కూడా దెబ్బ తీసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి బ్యాంకులపై సైబర్ దాడులకు పాల్పడుతోంది. దీంతో వినియోగదారుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇరాన్లో అతిపెద్ద బ్యాంక్ సెఫా బ్యాంక్‌పై ఇజ్రాయెల్ హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడినట్లు అక్కడి మీడియా వెబ్సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ బ్యాంక్ కస్టమర్లు ఏటీఎంల నుంచి నగదు తీసుకునేందుకు వీలుపడటం లేదు. ఇరాన్‌లోని పలు గ్యాస్ స్టేషన్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సెఫా బ్యాంక్ ద్వారానే జరుగుతుంటాయి. దీనిపై సైబర్ దాడికి పాల్పడితే.. దాని ప్రభావం గ్యాస్ స్టేషన్ల నిర్వహణపైనా పడుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ అధికార ప్రతినిధి స్పందిస్తూ… బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, సజావుగా సాగుతున్నట్లు చెప్పారు.
ఖామేనీ సన్నిహితుడు అలీ షాద్మానీ మృతి : ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామేనీకి అత్యంత సన్నిహితుడు అలీ షాద్మానీ మృతిచెందినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున తెహ్రాన్ నడిబొడ్డున ఉన్న కమాండ్ సెంటర్‌పై తాము జరిపిన దాడుల్లో అలీ షాద్మానీ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్ సాయుధ దళాలు.. ఈ రెండిరటికీ నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపింది. గత ఐదురోజులుగా ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల ప్రధాన అధికారి జనరల్ మొహమ్మద్ బాఘేరి, రెవెల్యూషనరీ గార్డ్స్ జనరల్ హుస్సేన్ సలామీ, ఖండాంతర క్షిపణి కార్యక్రమ అధికారి జనరల్ అమీర్ అలీ హాజీజాదే, అనేకమంది అణు శాస్త్రవేత్తలు, ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ డిప్యూటీ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జనరల్ ఘోలంరేజా మెహ్రాబీ, డిప్యూటీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జనరల్ మెహదీ రబ్బానీ మరణించిన విషయం తెలిసిందే.
ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో అలీ ఖమేనీ, ఆయన కుటుంబం తెహ్రాన్ ఈశాన్య ప్రాంతంలోని ఒక బంకర్లో తల దాచుకున్నట్లు తెలిసింది. యురేనియాన్ని శుద్ధి చేసుకొనే కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసేందుకు ఖామేనీకి ఇజ్రాయెల్ చివరి అవకాశమిచ్చిందని.., అందువల్లే దాడులు జరిగిన మొదటి రోజైన శుక్రవారం రాత్రి ఆయనను హత్య చేయకుండా వదిలేసిందని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ పేర్కొంది.
ఇరాన్‌లోని ఫార్దో అణు కేంద్రం యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ 60 శాతానికి పైగా శుద్ధి చేయగల సామర్థ్యం ఉండటం, గతంలో 83.7 శాతం శుద్ధి చేసిన యురేనియం ఆనవాళ్లు లభించడం వంటి అంశాలు అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తే ఇరాన్ అణుబాంబు తయారీ యత్నాలకు గట్టి దెబ్బ తగులుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీబీయూ-57 వంటి శక్తిమంతమైన బాంబుల ప్రయోగంపై చర్చ జరుగుతోంది. కాగా అమెరికా ఇప్పటికే తన సైనిక బలగాలను, యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని స్థావరాలకు తరలించినట్లు సమాచారం. యూఎస్ఎస్ నిమిట్జ్ విమాన వాహక నౌక కూడా ఈ ప్రాంతం వైపు కదులుతోంది. బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మోహరించింది. ఈ పరిణామాలన్నీ పశ్చిమాసియాలో మరో తీవ్ర సైనిక ఘర్షణకు దారితీస్తాయేమోనన్న భయాలను అంతర్జాతీయ సమాజంలో రేకెత్తిస్తున్నాయి.